© చిన్ని ఆశ
ప్రియమైన "నా ప్రియ" నేస్తానికి,
ప్రేమతో "నీ చిట్టి"
పండూ! ఎలా ఉన్నావు...బాగున్నావా...ఒక్కరోజుకే నా మీద ఇంత బెంగ అయితే ఎలా కన్నా?

హ్ మ్...అదుగదుగో, నాక్కనిపిస్తుందిలే నీ ముఖం...కనుబొమ్మలు చిట్లించి చెప్పలేని ఆ సహనాన్ని నువు దాస్తున్నా...ఆ కళ్ళు నాతో మాట్లాడేస్తున్నాయ్...ఆ ఎలా ఉంటానూ, నీకు తెలీదా? ఒక్కడినే వదిలేసి వెళ్ళి పొయావ్ గా...అంటూ నన్నడుగుతున్నాయ్...ఏం చెయ్యను పండూ! వెళ్ళక తప్పిందికాదు నాన్నా! నాకు మాత్రం నిన్నొక్కడినే వదలి వెళ్ళాలని ఉంటుందా, చెప్పు? నిన్నొదలి రాలేక వచ్చానన్న మాటే గానీ నువ్వన్నట్టే అనిపిస్తుంది...ఎంటీ అంటున్నావా? అదేనోయ్, వెళ్ళేముందు నువ్వన్నావ్ గా? వెళ్ళు వెళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను తల్చుకుని నువ్వే బాగా దిగులు పడ్తావ్ అని, అక్షరాలా అదే...చాలా దిగులుగా ఉందిరా కన్నయ్యా!

అయినా పండూ! ప్రేమంటే 24 గంటలూ ఒకరి దగ్గర ఒకరు కళ్ళల్లోకి చూస్తూ ఉండటం కాదంట...రోజులో 23 గంటలూ ఎంత కష్టమైన పనులన్నా చేసి మిగిలిన ఆ ఒక్క గంటలో నీ ఆలోచనలో నీ తలపులతో నిన్ను తలచుకుంటూ అన్ని గంటల శ్రమనీ ఇట్టే మర్చిపోవటమేనంటోయ్ ప్రేమంటే...
హ్ మ్...ఎవరో గానీ ఇలాటివి బానే చెప్తారు...అన్నావా? వినిపించిందీ చిట్టి మదికి...అనుకున్నా అంటావని...
దూరాన ఉన్నా నీ ఆ"రాధ"నే కదరా! పండూ, నువ్వలా దిగులుగా రాస్తే నాకూ చాలా దిగులేస్తది.

చూడు, రోజూ...ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో అని ఒకటే ఆలోచన. కానీ అంతలోనే మళ్ళీ ధైర్యం. ఎందుకో తెలుసా? అన్ని జాగ్రత్తలూ చెప్పే వచ్చా కదా! ఏనాడూ నేనేదైనా ఒక్కసారి చెప్పాక, నేను మర్చిపొయినా నా పండు ఎన్నటికీ మరువడు, చక్కగా కుదురుగా అన్నీ చెప్పినట్టే చేస్తాడు అని నీ "చిట్టి" ధీమా...ఎందుకోయ్ అంత ధీమా...అంటున్నావా? నీగురించి నాక్కాక ఇంకెవరికోయ్ బాగా తెలుసూ?

అయినా దిగులెందుకు చెప్పు...తొందరగా వచ్చెయ్యనూ...నీ చుట్టూ చూసుకున్నావా సరిగా, నేను నీ దగ్గర లేనని ఎవరన్నారు? కళ్ళు తెరవగనే చిట్టీ అని పిలుస్తావా? అప్పుడు నీ తలపుల్లో నీ పక్కనే లేనూ...కాఫీ తాగుతూ మన మొక్కలు చూస్తూ చిట్ట్తీ చూడు ఈ గులబీ ఎన్ని మొగ్గలేసిందో లెక్క బెట్టు అన్లేదూ, నువ్వు ఆలోచిస్తూ లెక్కలుపెట్టే చుక్కల లెక్క తప్పితే 'ఊప్స్ చిట్టీ' అనటం నేను విన్లేదనుకున్నావా?...హ్ మ్ ఈ ఒక్క కీస్ తోనె నీకూ నాకూ గొడవ, ఎప్పుడూ మర్చిపోతావు కదా...సర్లె సర్లె అంటున్నావా? ఓయ్ లంచ్ పాక్ చేసుకుంటున్నావా రోజూ లేదా ఊరికే అంటున్నావా? పండూ! నిన్ను చూస్తే నాకెంత ముచ్చటో, చక్కగా బద్ధకించకుండా, అన్నీ సర్దుకుని, బాక్స్ లో పెట్టుకుని బుద్ధిమంతుడిలా 'స్టార్ట్ అవుతున్నా చిట్టీ' అంటూ వెళ్తావు. రాముడు మంచి బాలుడు, అది అందరికీ తెలిసిందే. పెద్ద గొప్ప! "నా పండు మంచి బాలుడు", అదీ నాకు గొప్ప.

పండూ! టైం కి తింటున్నావు గా? నేను లేనని ఇంటికి లేట్ గా రాకు. తొందరగా వచ్చేసి రెస్ట్ తీసుకుని బోల్డు బొమ్మలెయ్యి. చూడు నీ బొమ్మలకి ఈ మధ్య బోల్డు అభిమానులు, కదూ! కానీ నువు, చిట్టీ ఈ బొమ్మలన్నీ నీ కోసమే అంటే నాకెంత సంబరమో! ఓయ్ నేనూ నీకన్నా బాగా బొమ్మలేస్తాను తెలుసా, నువ్వొప్పుకోకపోయినా సరే నేనేస్తా అంతే...అప్పుడోసారి నిన్ను కూర్చోబెట్టి నీ పేద్ద బొమ్మెయ్యలేదూ! అంతా అయ్యాక చూసి నువ్వేమన్నావ్ గుర్తుందా? హ్ మ్...పెద్ద గొప్పలే...నువ్వేమంటున్నావో నాకు తెల్సు...వెయ్యటం అనరు చిట్టీ...గియ్యటం...ఓయ్, మొన్నేమన్నావూ? నేనొచ్చేసరికి అప్పుడు నేనడిగిన బొమ్మేసి రెడీ గా ఉంచుతానని చెప్పావా...మొదలు పెట్టావా అసలు, లేదా చుక్కలు లెక్క పెడుతూ ఆ ముల్లు లేని గడియారం వంక అలా చూస్తూనే ఉన్నావా? ఇంతకీ అందులో ముళ్ళేమయ్యావనుకున్నావ్? నేనే తీసుకెళ్ళా పండూ...నేనెళ్ళాక అవెలాగూ తిరగవు కదాని...నాతో తీసుకొచ్చేస్తాగా, అప్పుడు మళ్ళీ గిర్రున తిరిగిపోతాయి.

పండూ! నువ్వింకా బోల్డ్ బొమ్మలేసి పేద్ద ఆర్టిస్ట్ వైపోతే చూస్తూ చెమర్చిన కన్నులతో ఆనందంగా నిన్ను చూసుకోవాలనుందిరా!
మనసున క్షణమైనా నిను వీడక ఉన్నా పండూ! దిగులు పడొద్దు నాన్నా...తొందరగా పరిగేత్తుకుని నీ దగ్గరకు వచ్చేస్తాగా...
బోల్డ్ అంటే బోల్డు  ప్రేమతో
నీ ప్రియనేస్తం
నీ "చిట్టి" 
-మీ చిట్టిపండు 
....

11 comments:

రసజ్ఞ said...

ముందు మీ చిట్టి ఉత్తరం చదివా. మీరు గీసిన చిత్రం మాత్రం చాలా సతాయించింది ఆలస్యంగా ఓపెన్ అయ్యి. అబ్బబ్బబ్బా! బొమ్మకి నేను ఫిదా! మాటలు లేవు! నేను చెప్పానా? చితి వచ్చేస్తుంది పరుగేతుకుంటూ అని వచ్చేసింది చాలా బాగుందండీ!

Zilebi said...

కాలమయ్యింది ఘంటారావం
కలమయ్యింది కాంతా భావం!
పండు రాంపండు
చిట్టి సీతాఫలం!

చీర్స్
జిలేబి.

వేణూ శ్రీకాంత్ said...

చాలాబాగుందండీ...
జిలేబి గారు మీ కామెంట్ కూడా నచ్చింది.

పల్లా కొండల రావు said...

చిట్టి , వచ్చింది !
గడియారమ్లో ముల్లు వచ్చాయి !!
పండు వేసిన 'చిట్టిబొమ్మ' అదేనండీ ! మన 'చిట్టీ' బొమ్మ ఎన్ని గంటలకు కనిపిస్తుందో !!
బొమ్మల అభిమానులు పెరుగుతున్నారుగా మరి !!!

చిన్ని ఆశ said...

@ రసజ్ఞ గారూ!
బహుశా ఉత్తరం చదివాకే బొమ్మ చూపించాలనేమో, లేదంటే మీరు బొమ్మ ని వదలి కిందికి రారు కదా! ;)
అవునండీ, మీరు చెప్పినట్టే చిట్టీ పరుగున వచ్చేస్తా అంటూ మాటిచ్చేసింది.
బొమ్మ కి మీరిచ్చిన ప్రశంశలకి ధన్యవాదాలు!

@ జిలేబి గారూ!
ఆశుకవిత్వం భలే చెప్పేశారండోయ్! మాకు భలే నచ్చింది. చాలా థ్యాంక్స్ అండీ!

@ వేణూ శ్రీకాంత్ గారూ!
మీకూ ధన్యవాదాలు!

@ పల్లా కొండల రావు గారూ!
మీరన్నట్టు చిట్టి గడియారంలో ముల్లులు తెచ్చేసింది.
పండు వేసే చిట్టి బొమ్మ ఈసారెలా కనిపిస్తుందో...
మా బొమ్మలు మెచ్చుకుంటున్న మీ అందరికీ కృతజ్ఞతలు !!!

సుభ/subha said...

మళ్ళీ ఢమాల్...

చిన్ని ఆశ said...

అయ్యయ్యయో 'సుభ'గారూ! జాగ్రత్తండీ...కాస్త మెల్లిగా...చూసుకోవచ్చుకదా? బొమ్మెక్కడికి పోతుందీ? మరీ అంత తొందరా?
;) Thanks a bunch అండీ!

శోభ said...

బోల్డు అంటే బోల్డు ప్రేమతో... వెరీ నైస్ చిన్ని ఆశ గారూ..... :)

చిన్ని ఆశ said...

@ శోభ గారూ! చాలా థ్యాంక్స్ అండీ!

nelabaludu said...

బొమ్మ భలె ఉందండి. ఓవరాల్ ఏ నైస్ షో!

చిన్ని ఆశ said...

@nelabaludu
ధన్యవాదాలు!

Post a Comment