© చిన్ని ఆశ
ప్రియతమా,
నిన్నొదలి ఒక్క క్షణమైనా ఉండలేను అన్నాననా, నన్నిలా ఒంటరిగా వదలి ఇన్ని రోజులు ఊరెళ్ళిపోయావు? నువు లేక చూడు తెలవారకముందే కనులు తెరిచినా మనసు నిన్నే ఆలోచిస్తూ బారెడు పొద్దెక్కేదాకా మంచం దిగనంటోంది. రోజూ లేచే సరికి "గుడ్ మార్నింగ్" అని చెప్తూ నవ్వుతు పలకరించే నీ మాటేదీ, కిల కిల మని వినిపించే ఆ నవ్వేదీ, నా కళ్ళల్లో వికసించే నీ రూపం ఏదీ, తెలవారగనే కిటికీలోంచి రివ్వున దూసుకు వచ్చే ఉదయ భానుడి కిరణాల్లోంచి వచ్చి నను తాకే నులువెచ్చని నీ స్పర్శేదీ.
పొద్దున ఆఫీస్ కెళ్తూ నిన్నే తలచుకున్నాను. రోజూ...లంచ్ పెట్టుకున్నావా, బ్రేక్ ఫాస్ట్ చేశావా, కార్ కీస్ మర్చిపోకు, వాలెట్ చూసుకో, మరీ ఎక్కువ పని చేసి అలసిపోకు, టైం కి లంచ్ తిను...అంటూ అన్నీ నువ్వై చూసుకునే నా నువ్వు ఈరోజు నాతో లేకపోయినా నువ్వున్నట్టే ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకుని భారంగా ఆఫీస్ కెళ్ళాను. వెళ్ళానన్న మాటే కానీ మనసు రానంటూ నీ దగ్గరే ఉండిపోయింది. నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అనుకుంటూ నిను తల్చుకుంటూనే ఉంది. లంచ్ టైం కి నిన్నే తలచుకున్నాను. ఆకలి లేకున్నా తినకుంటే నువు కోప్పడతావని తిన్నాను. నేనెక్కడున్నా సరిగా తింటున్నానో లేదో అని పూట పూటకీ ఆలోచించే నీ మది నాతో కలసి ఉంటే నాకిక దిగులెందుకు చెప్పు?
అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చే వేళ రోజూ నీ స్వరం విని అలసట మరచిపోయే నేను ఈ రోజు వినబడక భారంగా కనులు మూసుకుంటే నా కళ్ళల్లో నీ రూపం కన్నీరై కరగ సాగింది. నీరసంగా ఇంటికొచ్చి దిక్కుతోచక అలా మంచంపై వాలిపోయాను. దిగులుపడ్డ మనసుని సముదాయించే ప్రయత్నం చెయ్యలేకపోయాను. ఆలోచనలు నీ చుట్టూనే సుడులు తిరుగుతూ నను చుట్టుముట్టేశాయి. నువ్వున్నపుడు సంతోషంగా ఉత్సాహంగా అలసట ఎరుగక ఉరకలు తీసే ఈ గుండె ఇప్పుడెందుకిలా రోదిస్తుంది. కొద్ది రోజులేగా? మళ్ళీ నవ్వుతు నాకోసం తిరిగి వచ్చేస్తావు అని తెలిసినా ఎందుకిలా ఆవేదన పడుతోంది?
నువు వెళ్తూ చెప్పెళ్ళిన జాగ్రత్తలు ఏవీ ఈరోజు నేను మరవలేదు. ప్రతి పనిలో, నా ప్రతి కదలికలో నిన్నే తలచుకున్నాను. నాకన్నీ నువ్వే అయి చూసుకునే నా నువు నాతో ఉన్నావని రోజూ ఉప్పొంగిపోయే ఈ హృదయం నీ తలపులనే నీ మాటలుగా గుర్తుచేసుకుంటూ నువ్వున్నట్టే అనుకుంటూ దిగులుగా ఉంది. పడుకునే వేళకి దుప్పటి కప్పుతు "గుడ్ నైట్" అని చెప్తూ నా నుదుటుని తాకే ఆ మృదువైన లాలన లేక నా కన్నులు మూత పడనంటున్నాయి. నిద్దురలోనూ కమ్మని కలవై తోడుగ ఉండే నువ్వు, ఈ రోజు నిద్దురలేని చీకటి ఘడియన నా వద్దన చేరి నా కన్నులలో కలవై ఎలా ఒదిగిపోగలవు?
నువ్వున్నపుడు ఎందుకిలా పరిగెడుతోందీ అనిపించే కాలం, నువు లేనపుడెందుకిలా కదలనంటూ మొరాయించేసింది. అసలీ గడియారంకి ముల్లులున్నాయా అని పదే పదే చూసుకుంటూనే ఉన్నాను. నువ్వెళ్ళి ఇంకా ఒక్క రోజైనా కాలేదు, చూడు అప్పుడే ఎన్నోరోజులైనట్టు లెక్కలు మొదలెట్టాను. క్షణమైనా కదలని కాలంతో ప్రతి నిమిషమూ ఎందుకు నాకీ సమరం?
నువు లేని ఈ ఒంటరి తనంతో నన్ను మరింత ఒంటరిని చేసి ఇంకెపుడూ నను వీడి వెళ్ళవుకదూ?
నువు లేక కదలని క్షణాలని లెక్కిస్తూ ...
నువు లేక కదలని క్షణాలని లెక్కిస్తూ ...
నీ రాకకోసం నువ్వెళ్ళిన మరుక్షణం నుంచీ ప్రతిక్షణం ఎదురుచూస్తూ...
- నీ
"ప్రియమైన నేను"
"ప్రియమైన నేను"
-మీ చిట్టి, పండు
..♥♥..






10 comments:
బాగుంది
ఇంత విరహమా? మీ చిట్టి ఎంత అదృష్టవంతురాలు? తను లేదన్న బెంగతో, ఆలోచనతో మీరు గడియారంలోని ముళ్ళను కూడా మరిచారు. ఏంటండీ ఈ మధ్యన అందరూ ప్రేమలేఖలను తెగ రాసేస్తున్నాను? మాటలతో ఇంద్రజాలాన్ని చేశారు ఇది చదివిన వెంటనే పరుగెత్తుకుని వచ్చేస్తుంది మీ చిట్టి.
@ kastephale శర్మ గారూ, ధన్యవాదాలు.
@ రసజ్ఞ గారూ!
ఏం చేయ్యనండీ, గడియారంలో ముల్లే కాదు, మొన్నో రోజు ఎటో వెళ్తూ ఇల్లే మరిచాను. మా చిట్టి పరుగుల్లో ఫస్ట్, కానీ ఇది చదివి పరిగేత్తుకు వస్తుందంటారా?
ఏమో!
నేను కనిపెట్టేసానోచ్.గడియారంలో ముల్లుల్లేవండీ..అందుకే అది కదలట్లేదు.:):):) చాలా బాగుందండీ లేఖ.
మొత్తానికి ఒక రోజు గడిచిందన మాట !
@సుభ గారూ,
నిజమేనండోయ్ ముల్లుల్లేవు, నాకే కనపడ్లేదనుకున్నా.
ఈసారి బొమ్మని బానే పరిశీలించారు, ఇంతకీ లేచారా? ;)
థ్యాంక్స్ అండీ!
@ పల్లా కొండల రావు గారూ,
అవునండీ, మొత్తానికి ఒక్కరోజలా
గడియారం చూస్తూనే
గడిచి పోయింది
ఇంకెన్ని రోజులో, గంటలో, నిమిషాలో, సెకన్లో, క్షణాలో....ప్చ్!
బాగుంది మీ ప్రేమ. ఎప్పటికీ ఇలాగే కొనసాగాలని కాంక్షిస్తున్నాను:)
@ జయ గారూ,
మీ ఆ"కాంక్ష"కి చాలా థ్యాంక్స్ అండీ!
ఎంత బావుందో ఇది.
మీ బ్లాగ్ మొదటినుంచి చదవడం ఆరంభించాను.
నేను కామెంట్ పెట్టని పోస్ట్ ల కి కామెంట్స్ పెడతాను.
అన్నట్టు బ్లాగ్ template మార్చినట్టున్నారు చాలా బావుంది.
శైలబాల గారు చాలా రోజులుగా ఏమయ్యారబ్బా ఎదురు చూస్తున్నాము.
ఎప్పటి లానే .... తమరి రాక మాకెంతో....తెలుసుగా మిమ్మల్ని చూసినప్పుడల్లా మా మదిలో మెదిలే పాట...హ హా...ఎట్టకేలకు వేంచేశారు...
చాలా థ్యాంక్స్ అండీ ఓపిగ్గా అన్నీ చదువుతాను అన్నందుకు...మీకు మా భావాలెలా అనిపిస్తునాయో చెప్పండి. మీ స్పందనలకై ఎదురుచూస్తూ ఉన్నాము.
అవునండీ పాత్ర టెంప్లేట్ బ్రేక్ అయినందువల్ల మార్చక తప్పింది కాదు, చిట్టికి నచ్చి పెట్టుకున్న టెంప్లేట్ మొదటికి...మార్చక తప్పలేదు.
Post a Comment