© చిన్ని ఆశ

కృష్ణా...
నే లేనని ఈ పువ్వుల తెమ్మెరపై అలక నీకేలరా
నే రానని మన బృందావనాన్నీ కాంచకుందువా
నీ చెంత లేనని ఆ మురళీగానం మూగబోదగునా

ఈ పువ్వుల నడుమ నడయాడిన నీ రాధను కనరా
మన బృందావనమున నీకై వేచిన నీ దానిని కదరా
ఆ మురళిన వినిపించే మధురాధాగానం నను తాకురా

నేనట లేకున్నా వాటన్నిట నా నిరీక్షణ గురుతులు లేవా
నీ వద్దకు రాకున్నా ఆ పరిసర మధురిమలలో నే లేనా
నా కృష్ణుడి ఒడిలో సేదతీర నీ రాధ నీకడ రాకుండునా

నేనెచటనున్నా నీ "ఆరాధనే" రా కృష్ణా
నీ ఆ "రాధ" నే రా కృష్ణా
నీ "రాధ"నే రా కృష్ణా...

-మీ చిట్టిపండు
....

10 comments:

రసజ్ఞ said...

నేనెచటనున్నా నీ ఆ"రాధ"నే రా కృష్ణా
నీ"రాధ"నే రా కృష్ణా... బాగుందండి రాధ ఆరాధన! ఈ రాధ ఆరాధనా గీతిక!
నీ వద్దకు రాకున్నా ఆ పరిసర మధురిమలలో నే లేనా! ఇక్కడ జనాలు వ్యాఖ్యలు పెట్టకపోయినా ఈ చిన్ని ఆశ గీసిన చిత్రాన్ని వీక్షించకుండా ఉంటారా?

చిన్ని ఆశ said...

రసజ్ఞ గారూ,
ధన్యవాదాలు, మా పోస్ట్ రిలీజ్ అవగానే మీ స్పందనకై చూట్టం మాకు అలవాటైపోతూంది. లేకుంటే చిన్నబుచ్చుకుంటాం సుమండీ! ;-)
మేము గీసే చిత్రాన్నీ మెచ్చుకుటున్నారు, మళ్ళీ ధన్యవాదాలు...

పల్లా కొండల రావు said...

నేనెచటనున్నా నీ ఆ"రాధ"నే రా కృష్ణా
నీ"రాధ"నే రా కృష్ణా...
కృష్ణా!ఇది నీ 'రాధ' ఆ'రాధ'న .
రాధ ఆ'రాధ'నను,బాగా చెప్పారు. చివరి వాక్యాలు ఇంకా బాగున్నాయి.
కల్మషం లేని రాధాకృష్ణుల ప్రేమ ఇలలో లేదు కనక కల కనక తప్పదు. అదే కదా మన "చిన్నిఆశ".

చిన్ని ఆశ said...

కొండల రావు గారూ,
చివరి వాక్యాలు ఇంకా బాగున్నాయి...అంటూ మీరింకో వాక్యం చక్కగా జత చేశారు. బాగుంది. చాలా ధన్యవాదాలు.
ప్రేమలో ఎప్పుడూ కల్మషం ఉండదుకదండీ!

మధురవాణి said...

Wow... అద్భుతం.. కృష్ణుడి ప్రతిమ నిజంగా అద్భుతం.. మీరెంచుకున్న బంగారు రంగుల కలబోతలో కృష్ణుడు ఎంత మనోహరంగా ఉన్నాడో! నేను కవిత దాకా రాకుండా కృష్ణుడి బొమ్మ చూస్తూనే చాలా సేపు ఆగిపోయాను. :)
కవిత కూడా చాలా చాలా బాగుంది.. Simply superb! :)

చిన్ని ఆశ said...

ధన్యవాదాలు మధురవాణి గారూ!
కృష్ణుడి బొమ్మ మిమ్మల్ని కాసేపైనా ఆపగలిగిందంటే మా "రాధాకృష్ణుడు" మనోహరంగానే ఉన్నాడనమాట ;) మా అన్నామని కోపగించుకోకండే... ;)

మధురవాణి said...

మీరంత కష్టపడి బొమ్మ వేస్తే మీ కృష్ణుడు కాదని ఎలా అంటాను చెప్పండి. మాక్కూడా చూపించారు కదా.. అదే మహా భాగ్యం! :)))

చిన్ని ఆశ said...

థ్యాంక్స్ మధురవాణి గారూ!

సుభ said...

చిట్టి పండు గారూ ఆ కృష్ణుడిని నాకిచ్చేయరాదూ..బాబ్బాబు.. కావాలంటే మీకు ఇంకో కృష్ణుడ్ని ఇస్తాను.. ప్లీజ్ అండీ. అబ్బా ఎంత బాగా గీసారండీ చిత్రాన్ని.. నేనెప్పుడండీ గీసేది అలా? ఒక్క దెబ్బతో మీ ఫేన్ ని చేసేసుకున్నారు నన్ను. ఇంతకుముందు కొంచెం పడ్డాను. ఇప్పుడు పూర్తిగా పడిపోయాను. ఇక ఎలా లేవాలో అంతా ఆ కృష్ణుడిదే భారం.. హే బృందా విహారీ.. చిట్టి పండు గారి నుంచి నన్ను రక్షించవయ్యా కన్నయ్యా! ఇప్పుడు నిన్ను వేడుకోవడం కూడా వృధా ప్రయాసేలే.. నువ్వు నా కన్నా ముందే పడిపోయావుగా మరి..అయ్యో కన్నయ్యా మనిద్దరినీ రక్షించే వారే లేరా?

చిన్ని ఆశ said...

సుభ గారూ!
ఇదివరకు కాస్తా, ఇప్పుడు పూర్తిగా పడిపోయానంటూ చిట్టీ పండుల్ని, మరీ ఇంత ప్రాధేయంగా వేడుకుంటూ మా "చిట్టి" కృష్ణుడినీ దెబ్బకి పడేసేలా ఉన్నారు.
"చిట్టి" ముద్దుగా చూసుకుంటూ పెంచి పెద్ద చేసుకుంటున్న తన చిన్ని కృష్ణుడిని మీరలా అడగ్గానే ఇచ్చేస్తుందంటారా?
మీరు మా ఫేన్ అయ్యారని తెలిసి పొంగిపోతున్నాం.
ధన్యవాదాలండీ !

Post a Comment