© 2012 చిన్ని ఆశ, All Rights Reserved

"నను తలచే హృదయం
ఈ లోకాన ఒకటుందనిపిస్తే
నా క్షేమం కోరే ఓ మది
ఎక్కడో తపిస్తుందని తెలిస్తే

ఆ హృదయ భావాలు
నా మనసుని తాకవా
ఆ భావం చెప్పే ఊసులు
నా మదిని చేరవా

ఇక్కడ ఉంటూ ద్వేషించే మనుషుల
మధ్యన ఉన్నా నేనొంటరినే...కదా
ఎక్కడో ఉంటూ ప్రేమించే మనసు
పక్కన లేకున్నా తోడై ఉంది...కాదా

మనిషికి అవసరమైన జోడు
పక్కనున్న మనిషనుకుంటే
మనసుకి కావలసిన తోడు
ఎక్కడ ఉన్నా మనసే..ఉంటే

మనిషీ మనిషీ కలిస్తే బ్రతుకు
మనసూ మనసూ కలిస్తే జీవితం
మనిషీ మనసూ ఒక్కటి కాదు
మనిషి మారినా మనసు మారదు

నా ప్రాణమా, తోడై నా మనసుకి
నను ముందుకి నడిపించుమా!
ఈ ముళ్ళ దారిలో రేగే గాయాలకి
నీ ప్రేమే నాకు ఔషధం సుమా!"

-మీ చిట్టిపండు
....
© 2012 చిన్ని ఆశ, All Rights Reserved

"వెన్నెల్లో గోదావరి" - కల్లూరి శైలబాల గారు

గోదావరి అందాలను కళ్ళతో చూడగలిగితే...
ఆ అందంతో పండు వెన్నెలలో మనసారా ఊసులాడగలిగితే...
ఆ పండు వెన్నెల్లో గోదావరి అందాలని ప్రేమతో కలిసి ఆశ్వాదించగలిగితే...

అదే  "వెన్నెల్లో గోదావరి"...అందమైన ప్రేమ నవల.
సృష్టికర్త కల్లూరి శైలబాల గారు. వారి పరిచయ భాగ్యం మా "చిన్ని ఆశ" వల్లే. తను మెచ్చే బ్లాగుల శీర్షిక లో ఎన్నో మంచి బ్లాగులతోబాటు మా బ్లాగునీ తమ పాఠకులకి పరిచయం చెయ్యటం మాకెంతో సంతోషాన్నిచ్చింది. తమ అభిప్రాయాలతో మమ్మల్ని ప్రోత్సహిస్తూ, ఇప్పుడు ప్రత్యేకంగా తన బ్లాగులో మెచ్చుకుంటూ ఓ పోస్ట్ రాసేసి మా సంతోషానికి అవధులు లేకుండా చేసిన శైలబాల గారికి ధన్యవాదాలు. తను రాసిన ఆ పోస్ట్ కి స్పందిస్తూ మా బ్లాగునీ, మా భావాలనీ మెచ్చుకుంటూ ఎందరో తెలిపిన అభిప్రాయాలకి, వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు.

"నేను మెచ్చే బ్లాగ్ చిన్నఆశ" అంటూ రాసిన శైలబాల గారి పోస్ట్ ఇక్కడ చూడొచ్చు.

శైలబాలగారూ!
మా బ్లాగ్ కి రాగానే మీ మదిలో గుర్తుకొస్తూ  వినిపించే "లలిత ప్రియ కమలం విరిసినదీ..." కి గుర్తుగా ఈ పోస్ట్ కి మా బొమ్మ 'మీకోసం' ప్రత్యేకం...
బోల్డు ధన్యవాదాలండీ!



"బ్లాగర్స్ వరల్డ్" - పల్లా కొండలరావు గారు

ఏదోసాధించేశాం అన్నట్టు 100 పోస్ట్ లు రాశామని సంబరం చేసుకుంటూ మేము పెట్టిన పోస్ట్ కి స్పందించటమే కాక ఏకంగా తమ బ్లాగర్స్ వరల్డ్ లో మా 100 పోస్ట్ ల పోస్టర్ ని కొన్ని రోజులు ప్రముఖంగా నిలిపిన "పల్లా కొండలరావు" గారికీ మా ప్రత్యేక ధన్యవాదాలు.

మా ప్రతి పోస్ట్ లోని ప్రతి పదాన్నీ క్షుణ్ణంగా చదివి విశ్లేషిస్తూ స్పందించే కొండలరావు గారి స్పందనలు మా పోస్ట్ లోని భావంకన్నా మిన్నగా ఉంటాయి.

"పల్లా కొండలరావు గారూ, మీకు మా ప్రత్యేక ధన్యవాదాలండీ!"



"...స్వాగతించెను ప్రేమ పథం
సాగినది ఇరువురి బ్రతుకు రథం
కోరికల తారకల సీమలకు చేరుకొనె వడివడి పరువిడి
లలిత ప్రియ కమలం విరిసినదీ....కన్నుల కొలనిని..."

-మీ చిట్టిపండు
....
© 2012 చిన్ని ఆశ, All Rights Reserved

"ఒంటరితనం లో మనసు మా చెడ్డ నేస్తం
మాట వినక తనలో తనే రేపె అల్లకల్లోలం
మాటి మాటికీ గతం వైపునకేనా పయనం
వద్దని వారించినా లేదసలు ప్రయోజనం

మొన్నటికి మొన్న పట్టుకెళ్ళె బాల్యంలోకి
నాన్నని దేవుడు తీసుకెళ్ళిన ఏవోలోకాల్లోకి
నిన్నటికి నిన్న మోసుకెళ్ళె ప్రియనేస్తం దరికి
ఏక్కడుందో తెలియని గత జ్ఞాపకాలాల్లోకి

నేడెందుకు మళ్ళీ నీతో నాకీ ఒంటరి సావాసం
ఎక్కడికి లాక్కెళ్తావో తెలియక చేసే సాహసం
నా మనసు నీ ఇష్టం అనేగా నాపై నీ వెటకారం
ఇకపై నీ మాటవిననంటే ఎందుకంత వికట్టహాసం"

-మీ చిట్టిపండు
....

© చిన్ని ఆశ

మా వాడికి లెఖ్ఖల్లో వందకి వంద, మా టెండూల్కర్ వంద వందలు (చేశాక లెండి), మా సినిమా వందరోజుల విజయోత్సాహం, మాధిక్కారం [సంధి కలిపి పొందిగ్గా కాస్త కారం దట్టించాం...బాగు(ంటు)ందని. అదే 'మా అధి కారం' అని విడగొట్టి చదువుకోండి ;) ] వంద రోజులు గద్దెపై....ఇలా అందరూ వంద(అ)ని గర్వంగా సెలెబ్రేట్ చేసేసుకుంటుంటే బ్లాగ్ లోకంలో మనమూ మన వంద రచనలనీ గుర్తించి ఘనంగా చేసుకోవద్దూ మరి...

అప్పుడే వంద మాట(పా)ల మూటలు మా "చిన్ని ఆశ" లో రాశామా అనుకుంటే మాకే ఎంతో ఆశ్చర్యం వేసింది. అందుకే ఇలా ఈ స్పెషల్ పో(స్టర్) స్ట్ తో మీ అందరితోనూ సెలబ్రేట్ చేసుకుంటున్నాం.

చిన్ని గుండెల్లో ఆ "చిన్ని ఆశ" ఫలించేనా? అంటూ మా మొదటి పోస్ట్ రాసి ఇప్పటికి 516 రోజులు. ఈ 516 రోజుల్లో 101 పోస్ట్ లు. అంకెల్లో మా భావాలని కొలవాలని ప్రయత్నిస్తే  ప్రతి 5 రోజులకీ ఒక పోస్ట్, అందులో 25 పోస్ట్ లకి పదాల కూర్పుతో బాటు రంగు రంగుల గీతల చేర్పూ చేసే ప్రయత్నాలు. మా వందవ పోస్ట్ "చిత్రించా చెలీ" నా మనోఫలకం పై నిను శాశ్వతంగా... అంటూ పండు తన ప్రాణమైన చిట్టి ని మనసారా మాటల్లో, గీతల్లో, రంగుల్లో చిత్రించుకుంటూ చెప్పుకునే ప్రేమ భావం.

చిట్టి, పండు లాంటి ప్రేమ హృదయాలు ఎన్నో ఈ ఇలలో ఉంటాయి. నిత్యం ఆ ప్రేమ హృదయాలు ఎన్నెన్నో భావాలతో ఆలోచిస్తూనే ఉంటాయి. ఆ హృదయ భావాలు చెప్పకనే ఒకదానికొకటి చేరిపోతుంటాయి. ఆ గుండెలు ఆ భావాలకి స్పందిస్తూనే ఉంటాయి. ఒకదాని కోసం ఒకటి ఎప్పటికీ తపిస్తూనే ఉంటాయి. అలాంటి హృదయాల "చిన్ని ఆశలు" ఫలించాలి అన్న చిన్ని ఆలోచనకి మేమివ్వాలని చేస్తున్న ఈ చిన్ని ప్రయత్నమే మా "చిన్ని ఆశ".

"పండూ మనమూ మన భావాల్ని బ్లాగ్ రూపంలో రాయొచ్చుగా, అందరితోనూ పంచుకోవచ్చుగా..." అని 'చిట్టి' ముద్దుగా 'పండు' ని అడిగినపుడు, పండు అవును కదా అని, వెంటనే...మరి ఏం రాద్దాం...పేరేం పెడదాం...అన్నపుడు మా 'చిట్టి' చిన్ని బుర్రకి తట్టిన గొప్ప ఆలోచనే "చిన్ని ఆశ". అలా పుట్టిన మా ఈ "చిన్ని ఆశ" బ్లాగ్ లోకంలోకి బుడి బుడి నడకలతో ప్రవేశించింది. క్రమేపీ మా భావగీ(త)తికలకు మా 'చిట్టి' ప్రోత్సాహంతో ఉత్సాహంగా గీతవర్ణాల రూపమూ ఇవ్వటం మొదలెట్టాం. మా ప్రతి పోస్ట్ కీ స్పందిస్తూ మమ్మల్ని ఉత్సాహపరుస్తూ, తమ అభిప్రాయాలను మాతో పంచుకుంటూ ముందుకి నడిపిస్తున్న మా పాఠకులందరికీ, తోటి బ్లాగర్లకీ ఈ సందర్భంగా "ధన్యవాదాలు".

రెగ్యులర్ గా మా భావాలకి స్పందిస్తూ మాకెంతో ఉత్సాహాన్నిస్తున్న కల్లూరి శైలబాల గారు, రసజ్ఞ గారు, పల్లా కొండల రావు గారు, వేణూ శ్రీకాంత్ గారు, సుభ గారు, జిలేబి గారు, మధుర వాణి గారు,  శోభ గారు, జయ గారు, వల్లి గారు, చిన్ని గారు, పద్మార్పిత గారు, జ్యోతిర్మయి గారు,  వనజవనమాలి గారు, జ్యోతి గారు, మాలాకుమార్ గారు, లక్ష్మిరాఘవ గారు, ప్రవీణ గారు, నందు గారు,  Indian Minerva, నెలబాలుడు గారు, C.ఉమాదేవి గారు, మాధవ రావు పబ్బరాజు గారు, శశి కళ గారు, తెలుగు పాటలు, చెప్పాలంటే, బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్ గారు, రాజి గారు, ఫణి గారు,  సందీప్ గారు...ఇలా పేరు పేరునా...ఎందరో...ఎందరెందరో. ఇందులో చాలా మంది ఇప్పటికే తమ భావాలతో, చిత్ర, పద కూర్పులతో బ్లాగ్ రీడర్లకి సుపరిచయం.

మా భావాలకీ, బొమ్మలకీ స్పందించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా మా "ప్రత్యేక ధన్యవాదాలు".

-మీ చిట్టిపండు
....
© చిన్ని ఆశ

"వేకువ వెలుతురు నింగిని చీల్చుకుంటూ నేలపై పరచుకుంటున్న ఓ ప్రశాంత ఉదయం
వికసించెను మదిలో అనునిత్యం నేనున్నానంటూ నీడై కదలాడే చెలి సుందర వదనం

మెరిసి మాయమయె కన్నుల ఎదుట అందమైన ఆ దివ్య రంగుల కుసుమ సోయగం
నలుదిక్కుల మది వెతకసాగె హృది మీటి అదృశ్యమయిన ఆ పసిడి ప్రతిబింబం కోసం

అంతట సన్నగ వీచె మది మధుర వనాన చెలి రూపం చిత్రించాలన్న కోరికల పవనం
మదిన దాగిన ఆ రూపం అందంగా చిత్రించాలని కలిగెను మనసున ఎనలేని ఉత్సాహం

మేమూ చెలి చిత్రంలో విలీనమయెదమంటూ తరలివచ్చె మా చిన్ని స్నేహ సమూహం
నీలవర్ణం వెనక నేనై చెలి బంగరు మేని వన్నెను ప్రకాశింపజేస్తా అని దిగివచ్చె నీలాకాశం

ఎర్రని సింధూరతిలకం నుదుటిన నేనయ్యెదనని వేంచేసెను వెచ్చని సూర్యోదయ కిరణం
ఆభరణమై మెడవంపున మెరిసి మురిసెదమంటూ వచ్చి చేరెను ఆ చంద్రలోకతారార్కం

మేని సోయగాలను తాకే తెల్లని పట్టు చీర అయ్యెదనని వచ్చె మరుమల్లియ తెల్లదనం
చీర అంచున పొందికగా ఒదిగెదమంటూ కదలి వచ్చె ఇంద్రధనుసున సప్తవర్ణ మిళితం

మా పచ్చదనంతో మరింత నిండుదనం తెచ్చెదమని వచ్చి వాలెను చిలుకల ద్వయం
కురులకు నలుపుగ నన్నద్దుము అంటూ కమ్ముకు వచ్చె నిశీధ కారుచీకటి నల్లదనం

చుక్కల లోకంలో చెలిని నాపై గర్వంగా విహరింపజేసెదనని వచ్చిచేరెనో శ్వేతాశ్వం
కలకాలం ప్రియ పరిమళ కాంతులతో శోభిల్లుదునని కళ్ళముందు నిలిచె చెలి రూపం

ఆ చిత్రం జన్మజన్మలకూ చెదరక తనలో నింపుకుందునని సిద్ధమయె నా మనోఫలకం
రంగుల మిశ్రమాన నెచ్చెలి గురుతుగ నేనూ కరిగెదనని జాలువారెనో ఆనంద భాష్పం..."

-మీ చిట్టిపండు
....

© చిన్ని ఆశ

"నువ్వొచ్చేస్తున్నావని మన తోటంతా మళ్ళీ నవ వసంతం నిండుకుంటోంది
నీకు ఎదురేగి స్వాగతం పలకాలని మన గులాబీ మొన్నే మొగ్గలు తొడిగింది

ఇన్నిరోజులూ ముద్దబంతి తన నవ్వులు నీతోనే పంచుకోవాలనే దాచి ఉంచింది
పూయని చిట్టి చేమంతి కొత్త రంగులు సంతరించి విరబూయటం మొదలెట్టింది

నువులేక పరిమళించనని అలక పానుపెక్కిన మరుమల్లె గుభాళించ సాగింది
చిన్నబోయి అక్కడే ఆగిపోయిన సన్నజాజి తీగ నీకోసం పందిరినల్ల సాగింది

విరియని మందారం తన మోమున సిగ్గు దొంతరలు దాచి విచ్చుకుంటోంది
నిత్యం ఈ నేలపై తిరుగాడే నీ పాద స్పర్శకై లేత పచ్చిక పరుచుకుంటోంది

మన చిలుక అదుగదుగో చిట్టి అని తిరుగుతు మాటిమాటికీ సందడి చేస్తోంది
నీ రాకతొ మా "చిట్టి సంబరాలు" కోసం నింగిన నిండు జాబిలీ తొంగి చూస్తోంది

మాయమైన గడియారం ముల్లూ వచ్చి నా గుండె వేగంతో పోటీ పడుతోంది
నిశ్శబ్ధంలో మూగబోయిన నా హృదయం మళ్ళీ కొత్త రాగాలు ఆలపిస్తోంది"

-మీ చిట్టిపండు
....
© చిన్ని ఆశ

"నిన్నొదలి ఒక్కరోజైనా ఉండలేని నన్ను ఒంటరి చేసెళ్ళావ్...ఇన్ని రోజులా
నిన్నే మదిలో తలచుకుంటూ క్షణమో యుగంలా గడిపేశా...ఎలాగోలా
రేపు నువ్వొచ్చేస్తావని ఈరోజంతా నా కనులు రెప్పపడనంటున్నాయి...ఎలా
నువ్వొచ్చేస్తున్నావన్న సంబరంలో పొద్దున మర్చిపోయాను...అన్నీ మరలా
నువు లేక నిజంగానే ఇన్నిరోజులు గడపగలిగానా ఇది నిజమేనా...లేక కలా
మళ్ళీ నన్నిలా ఒంటరిగా వదలి ఎక్కడికీ వెళ్ళవుగా ఇక...ఎన్నడూ ఇలా
నవ్వుతు నువు తెచ్చే నవ్వుల వసంతంకై ఎదురుచూస్తున్నా...నే కోయిలలా"

-మీ చిట్టిపండు
....

© చిన్ని ఆశ

"ప్రతి నిమిషం నా ప్రాణంగానే అనిపిస్తావు
నాలో ఇమిడిపోయి అన్నిటా అగుపిస్తావు

నువు లేవని కాలం ఆగక వెళ్ళి పోయినా
నువ్వున్నావని మనసు ఉప్పొంగిపోయినా

వెళ్ళిన కాలం వెనుక నువ్వొదలిన జ్ఞాపకాలే
ఉప్పొంగే మనసు ఎదుట నిన్నొదలని ఆశలే

ప్రాణంలో ప్రాణమై నువు నాలోనే ఉండగ
నువులేవని అనలేను ఈ గుండెకి తోడుగ

ఈ జన్మకి నాలో ప్రాణమైన ఓ నా నేస్తం
మరిన్ని జన్మలకీ అవగలవా నా సమస్తం ..."

-మీ చిట్టిపండు
....


"నూతనం"
అంటేనే ఎవరికైనా మనసున ఉత్సాహం నిండుకుంటుంది. ప్రతి ఉదయమూ నూతనమే, అయినా అది రోజూ వచ్చే ఉదయంలానే అనిపిస్తుంది. అందులో నూతనం ఏముంది...నిన్నటి సూర్యుడే, చుట్టూ నిన్నటి ఆ మనుషులే, ఆ పరిసరాలే...ఎప్పుడైనా ఎవరై నా కొత్తవాళ్ళు మనింటికి వచ్చినా, కొత్త ప్రదేశాలకి మనమెళ్ళినా ఆ రోజేదో నూతనంగా అనిపిస్తుంది. లేదంటే మళ్ళీ షరా మామూలే...రోజూ రొటీన్...పని, పని, పనీ...
మరి నేడో...నిన్నటి ఆ ఉదయమే, ఆ మనుషులే, ఆ పరిసరాలే...అయినా ఏదో నూతనత్వం మది బయటా, లోపలా, ప్రతిఒక్కరిలోనూ...
అదే ఈనాటి ప్రత్యేకం...
నూతనం...
నూతనత్వం... 

"నూతన సంవత్సరం"
కొత్త సంవత్సరం మన జీవితంలో అడుగిడుతుందంటేనే ఎక్కడలేని ఉత్సాహమూ వచ్చేస్తుంది కదూ అందరిలోనూ! అది చెయ్యాలీ, ఇది చెయ్యాలీ, అలా ఉండాలీ, ఇది సాధించాలీ...అనుకుంటూ ఎన్నో కొత్త కొత్త రిజల్యూషన్స్ మన లిస్ట్ లో చటుక్కున చేరిపోతాయి. జీవితంలో పాతదై వెనక్కెళ్ళిపోతున్న 'పాత' సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ 'కొత్త' సంవత్సరాన్ని సంతోష, సగర్వ, సాదర,స్వాగతాలతో ఆహ్వానిస్తూ నూతనోత్సాహం ఉరకలు వేసే ఆ క్షణాన ప్రపంచం అంతా సందడిగా జరుపుకునే ఏకైక పండుగ ఇదొక్కటే కదూ!

"గత కాలంలో కలసి పోయే నిన్న
గుండె జ్ఞాపకాల్లో  ఎన్నటికీ మిన్న
నిన్న పోయినా నేనున్నాననే రేపు
మదిలో మరలా చిగురాశలు రేపు

నిన్న మెదిలే జ్ఞాపకాల స్వగతం
రేపు
మదిలో ఆనందాల స్వాగతం"

ఈ నూతన సంవత్సరం అందరి జీవితాల్లోనూ శుభప్రదాయకం అవ్వాలని ఆకాంక్షిస్తూ,
నూతన "శుభప్రద" ఆకాంక్షలతో...
నూతన సంవత్సర శుభాకాంక్షలతో "2012" కి సుస్వాగతం...
-మీ చిట్టిపండు
....
© చిన్ని ఆశ
ప్రియమైన "నా ప్రియ" నేస్తానికి,
ప్రేమతో "నీ చిట్టి"
పండూ! ఎలా ఉన్నావు...బాగున్నావా...ఒక్కరోజుకే నా మీద ఇంత బెంగ అయితే ఎలా కన్నా?

హ్ మ్...అదుగదుగో, నాక్కనిపిస్తుందిలే నీ ముఖం...కనుబొమ్మలు చిట్లించి చెప్పలేని ఆ సహనాన్ని నువు దాస్తున్నా...ఆ కళ్ళు నాతో మాట్లాడేస్తున్నాయ్...ఆ ఎలా ఉంటానూ, నీకు తెలీదా? ఒక్కడినే వదిలేసి వెళ్ళి పొయావ్ గా...అంటూ నన్నడుగుతున్నాయ్...ఏం చెయ్యను పండూ! వెళ్ళక తప్పిందికాదు నాన్నా! నాకు మాత్రం నిన్నొక్కడినే వదలి వెళ్ళాలని ఉంటుందా, చెప్పు? నిన్నొదలి రాలేక వచ్చానన్న మాటే గానీ నువ్వన్నట్టే అనిపిస్తుంది...ఎంటీ అంటున్నావా? అదేనోయ్, వెళ్ళేముందు నువ్వన్నావ్ గా? వెళ్ళు వెళ్ళు వెళ్ళిన తర్వాత నన్ను తల్చుకుని నువ్వే బాగా దిగులు పడ్తావ్ అని, అక్షరాలా అదే...చాలా దిగులుగా ఉందిరా కన్నయ్యా!

అయినా పండూ! ప్రేమంటే 24 గంటలూ ఒకరి దగ్గర ఒకరు కళ్ళల్లోకి చూస్తూ ఉండటం కాదంట...రోజులో 23 గంటలూ ఎంత కష్టమైన పనులన్నా చేసి మిగిలిన ఆ ఒక్క గంటలో నీ ఆలోచనలో నీ తలపులతో నిన్ను తలచుకుంటూ అన్ని గంటల శ్రమనీ ఇట్టే మర్చిపోవటమేనంటోయ్ ప్రేమంటే...
హ్ మ్...ఎవరో గానీ ఇలాటివి బానే చెప్తారు...అన్నావా? వినిపించిందీ చిట్టి మదికి...అనుకున్నా అంటావని...
దూరాన ఉన్నా నీ ఆ"రాధ"నే కదరా! పండూ, నువ్వలా దిగులుగా రాస్తే నాకూ చాలా దిగులేస్తది.

చూడు, రోజూ...ఏం చేస్తున్నావో, ఎలా ఉన్నావో అని ఒకటే ఆలోచన. కానీ అంతలోనే మళ్ళీ ధైర్యం. ఎందుకో తెలుసా? అన్ని జాగ్రత్తలూ చెప్పే వచ్చా కదా! ఏనాడూ నేనేదైనా ఒక్కసారి చెప్పాక, నేను మర్చిపొయినా నా పండు ఎన్నటికీ మరువడు, చక్కగా కుదురుగా అన్నీ చెప్పినట్టే చేస్తాడు అని నీ "చిట్టి" ధీమా...ఎందుకోయ్ అంత ధీమా...అంటున్నావా? నీగురించి నాక్కాక ఇంకెవరికోయ్ బాగా తెలుసూ?

అయినా దిగులెందుకు చెప్పు...తొందరగా వచ్చెయ్యనూ...నీ చుట్టూ చూసుకున్నావా సరిగా, నేను నీ దగ్గర లేనని ఎవరన్నారు? కళ్ళు తెరవగనే చిట్టీ అని పిలుస్తావా? అప్పుడు నీ తలపుల్లో నీ పక్కనే లేనూ...కాఫీ తాగుతూ మన మొక్కలు చూస్తూ చిట్ట్తీ చూడు ఈ గులబీ ఎన్ని మొగ్గలేసిందో లెక్క బెట్టు అన్లేదూ, నువ్వు ఆలోచిస్తూ లెక్కలుపెట్టే చుక్కల లెక్క తప్పితే 'ఊప్స్ చిట్టీ' అనటం నేను విన్లేదనుకున్నావా?...హ్ మ్ ఈ ఒక్క కీస్ తోనె నీకూ నాకూ గొడవ, ఎప్పుడూ మర్చిపోతావు కదా...సర్లె సర్లె అంటున్నావా? ఓయ్ లంచ్ పాక్ చేసుకుంటున్నావా రోజూ లేదా ఊరికే అంటున్నావా? పండూ! నిన్ను చూస్తే నాకెంత ముచ్చటో, చక్కగా బద్ధకించకుండా, అన్నీ సర్దుకుని, బాక్స్ లో పెట్టుకుని బుద్ధిమంతుడిలా 'స్టార్ట్ అవుతున్నా చిట్టీ' అంటూ వెళ్తావు. రాముడు మంచి బాలుడు, అది అందరికీ తెలిసిందే. పెద్ద గొప్ప! "నా పండు మంచి బాలుడు", అదీ నాకు గొప్ప.

పండూ! టైం కి తింటున్నావు గా? నేను లేనని ఇంటికి లేట్ గా రాకు. తొందరగా వచ్చేసి రెస్ట్ తీసుకుని బోల్డు బొమ్మలెయ్యి. చూడు నీ బొమ్మలకి ఈ మధ్య బోల్డు అభిమానులు, కదూ! కానీ నువు, చిట్టీ ఈ బొమ్మలన్నీ నీ కోసమే అంటే నాకెంత సంబరమో! ఓయ్ నేనూ నీకన్నా బాగా బొమ్మలేస్తాను తెలుసా, నువ్వొప్పుకోకపోయినా సరే నేనేస్తా అంతే...అప్పుడోసారి నిన్ను కూర్చోబెట్టి నీ పేద్ద బొమ్మెయ్యలేదూ! అంతా అయ్యాక చూసి నువ్వేమన్నావ్ గుర్తుందా? హ్ మ్...పెద్ద గొప్పలే...నువ్వేమంటున్నావో నాకు తెల్సు...వెయ్యటం అనరు చిట్టీ...గియ్యటం...ఓయ్, మొన్నేమన్నావూ? నేనొచ్చేసరికి అప్పుడు నేనడిగిన బొమ్మేసి రెడీ గా ఉంచుతానని చెప్పావా...మొదలు పెట్టావా అసలు, లేదా చుక్కలు లెక్క పెడుతూ ఆ ముల్లు లేని గడియారం వంక అలా చూస్తూనే ఉన్నావా? ఇంతకీ అందులో ముళ్ళేమయ్యావనుకున్నావ్? నేనే తీసుకెళ్ళా పండూ...నేనెళ్ళాక అవెలాగూ తిరగవు కదాని...నాతో తీసుకొచ్చేస్తాగా, అప్పుడు మళ్ళీ గిర్రున తిరిగిపోతాయి.

పండూ! నువ్వింకా బోల్డ్ బొమ్మలేసి పేద్ద ఆర్టిస్ట్ వైపోతే చూస్తూ చెమర్చిన కన్నులతో ఆనందంగా నిన్ను చూసుకోవాలనుందిరా!
మనసున క్షణమైనా నిను వీడక ఉన్నా పండూ! దిగులు పడొద్దు నాన్నా...తొందరగా పరిగేత్తుకుని నీ దగ్గరకు వచ్చేస్తాగా...
బోల్డ్ అంటే బోల్డు  ప్రేమతో
నీ ప్రియనేస్తం
నీ "చిట్టి" 
-మీ చిట్టిపండు 
....
© చిన్ని ఆశ
ప్రియతమా,
నిన్నొదలి ఒక్క క్షణమైనా ఉండలేను అన్నాననా, నన్నిలా ఒంటరిగా వదలి ఇన్ని రోజులు ఊరెళ్ళిపోయావు? నువు లేక చూడు తెలవారకముందే కనులు తెరిచినా మనసు నిన్నే ఆలోచిస్తూ బారెడు పొద్దెక్కేదాకా మంచం దిగనంటోంది. రోజూ లేచే సరికి "గుడ్ మార్నింగ్" అని చెప్తూ నవ్వుతు పలకరించే నీ మాటేదీ, కిల కిల మని వినిపించే ఆ నవ్వేదీ, నా కళ్ళల్లో వికసించే నీ రూపం ఏదీ, తెలవారగనే కిటికీలోంచి రివ్వున దూసుకు వచ్చే ఉదయ భానుడి కిరణాల్లోంచి వచ్చి నను తాకే నులువెచ్చని నీ స్పర్శేదీ.

పొద్దున ఆఫీస్ కెళ్తూ నిన్నే తలచుకున్నాను. రోజూ...లంచ్ పెట్టుకున్నావా, బ్రేక్ ఫాస్ట్ చేశావా, కార్ కీస్ మర్చిపోకు, వాలెట్ చూసుకో, మరీ ఎక్కువ పని చేసి అలసిపోకు, టైం కి లంచ్ తిను...అంటూ అన్నీ నువ్వై చూసుకునే నా నువ్వు ఈరోజు నాతో లేకపోయినా నువ్వున్నట్టే ఒకటికి రెండు సార్లు అన్నీ చూసుకుని భారంగా ఆఫీస్ కెళ్ళాను. వెళ్ళానన్న మాటే కానీ మనసు రానంటూ నీ దగ్గరే ఉండిపోయింది. నువ్వెలా ఉన్నావో, ఏం చేస్తున్నావో అనుకుంటూ నిను తల్చుకుంటూనే ఉంది. లంచ్ టైం కి నిన్నే తలచుకున్నాను. ఆకలి లేకున్నా తినకుంటే నువు కోప్పడతావని తిన్నాను. నేనెక్కడున్నా సరిగా తింటున్నానో లేదో అని పూట పూటకీ ఆలోచించే నీ మది నాతో కలసి ఉంటే నాకిక దిగులెందుకు చెప్పు? 

అలసిపోయి సాయంత్రం ఇంటికి వచ్చే వేళ రోజూ నీ స్వరం విని అలసట మరచిపోయే నేను ఈ రోజు వినబడక భారంగా కనులు మూసుకుంటే నా కళ్ళల్లో నీ రూపం కన్నీరై కరగ సాగింది. నీరసంగా ఇంటికొచ్చి దిక్కుతోచక అలా మంచంపై వాలిపోయాను. దిగులుపడ్డ మనసుని సముదాయించే ప్రయత్నం చెయ్యలేకపోయాను. ఆలోచనలు నీ చుట్టూనే సుడులు తిరుగుతూ నను చుట్టుముట్టేశాయి. నువ్వున్నపుడు సంతోషంగా ఉత్సాహంగా అలసట ఎరుగక ఉరకలు తీసే ఈ గుండె ఇప్పుడెందుకిలా రోదిస్తుంది. కొద్ది రోజులేగా? మళ్ళీ నవ్వుతు నాకోసం తిరిగి వచ్చేస్తావు అని తెలిసినా ఎందుకిలా ఆవేదన పడుతోంది?

నువు వెళ్తూ చెప్పెళ్ళిన జాగ్రత్తలు ఏవీ ఈరోజు నేను మరవలేదు. ప్రతి పనిలో, నా ప్రతి కదలికలో నిన్నే తలచుకున్నాను. నాకన్నీ నువ్వే అయి చూసుకునే నా నువు నాతో ఉన్నావని రోజూ ఉప్పొంగిపోయే ఈ హృదయం నీ తలపులనే నీ మాటలుగా గుర్తుచేసుకుంటూ నువ్వున్నట్టే అనుకుంటూ దిగులుగా ఉంది. పడుకునే వేళకి దుప్పటి కప్పుతు "గుడ్ నైట్" అని చెప్తూ నా నుదుటుని తాకే ఆ మృదువైన లాలన లేక నా కన్నులు మూత పడనంటున్నాయి. నిద్దురలోనూ కమ్మని కలవై తోడుగ ఉండే నువ్వు, ఈ రోజు నిద్దురలేని చీకటి ఘడియన నా వద్దన చేరి నా కన్నులలో కలవై ఎలా ఒదిగిపోగలవు?

నువ్వున్నపుడు ఎందుకిలా పరిగెడుతోందీ అనిపించే కాలం, నువు లేనపుడెందుకిలా కదలనంటూ మొరాయించేసింది. అసలీ గడియారంకి ముల్లులున్నాయా అని పదే పదే చూసుకుంటూనే ఉన్నాను. నువ్వెళ్ళి ఇంకా ఒక్క రోజైనా కాలేదు, చూడు అప్పుడే ఎన్నోరోజులైనట్టు లెక్కలు మొదలెట్టాను. క్షణమైనా కదలని కాలంతో ప్రతి నిమిషమూ ఎందుకు నాకీ సమరం?

నువు లేని ఈ ఒంటరి తనంతో నన్ను మరింత ఒంటరిని చేసి ఇంకెపుడూ నను వీడి వెళ్ళవుకదూ?
నువు లేక కదలని క్షణాలని లెక్కిస్తూ ...
నీ రాకకోసం నువ్వెళ్ళిన మరుక్షణం నుంచీ ప్రతిక్షణం ఎదురుచూస్తూ...
- నీ
"ప్రియమైన నేను"
-మీ చిట్టిపండు
....
© చిన్ని ఆశ

"కలసి నడవాల్సిన జీవన దారులు వేరైపోతే
కనుచూపు మేరనంతా కారు చీకటే అయితే
ఎక్కడికీ గమ్యం తెలియని బ్రతుకు పయనం
ఎందులకీ శృతీ గతీ తప్పిన జీవన సమరం

కానరాని బాటన ఎదురై వెళుతూ కనిపిస్తావనా
చీకటి మాటున చిరుదీపమై వెలుగులు తెస్తావనా
కలలుగన్న మనసున ఆశలు నువ్వై తీరుస్తావనా
నాతో రాని గతంలో రేపై నా పక్కన నిలుస్తావనా

నీకోసం వగచిన ఈ గుండెని శోధించి చూసినా
జన్మంతా దక్కిందీ ఆరని ఆ కన్నీటి ధారలేనా
అందరాని మరో లోకానికి తరలి నేనెళ్ళిపోయినా
చిరిగిన బ్రతుకున అతుకు నీకైనా సాధ్యమగునా"

-మీ చిట్టిపండు
....